కర్నూలు: స్థానిక ఏపీఎస్పీ రెండో బెటాలియన్ పెరేడ్ మైదానంలో 2025–26 బ్యాచ్‌కు చెందిన 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పెరేడ్ రిహార్సల్స్ జరిగాయి. రెండో బెటాలియన్‌లో శిక్షణ పొందిన 430 మంది, కర్నూలు డీటీసీలో శిక్షణ పొందిన 199 మంది కలిపి మొత్తం 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు ఈనెల 26న ప్రధాన పాసింగ్ ఔట్ పెరేడ్ జరగనుంది. అందుకు సంబంధించిన రిహార్సల్స్‌ను గురువారం నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ హాజరై ట్రైనీ పోలీసుల కవాతును పరిశీలించారు. ప్రధాన పాసింగ్ ఔట్ పెరేడ్‌ను సమన్వయంతో విజయవంతం చేసేలా అధికారులు, ట్రైనీ పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. శిక్షణ కాలంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరచిన కానిస్టేబుళ్లకు కమాండెంట్ దీపిక పాటిల్ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. 26న జరిగే ప్రధాన వేడుకకు జిల్లా మంత్రి టీజీ భరత్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ ఎ.సిరి ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. ట్రైనీలకు శిక్షణ కాలంలో సహకరించి విశేష సేవలందించిన శిక్షకులకు, పోలీసు అధికారులకు వారి సేవలను గుర్తిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, అసిస్టెంట్ కమాండెంట్లు వెంకటరమణ, ఎస్‌ఎం బాషా, వెంకటశివుడు, డీటీసీ వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


