ఓర్వకల్లు: మండలంలోని హుసేనాపురం గ్రామానికి చెందిన కొందరు టీడీపీ మూకలు, అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు గడేకారి వెంగన్న కుమారుడు వెంకట సుబ్బన్నపై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై గురువారం బాధితుడి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 20వ తేదీన సాయంత్రం వెంకట సుబ్బన్న ఇంట్లో ఉండగా టీడీపీకి చెందిన పల్లె మధు ఫోన్ చేసి హైవేలో ఉన్న హెచ్‌ఎం హోటల్ దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆ హోటల్ వద్దకు వెళ్లగా మధు అను వ్యక్తి వెనుక నుంచి కొట్టాడని, తిరిగి చూడగా మల్లెల ప్రశాంత్ అనే వ్యక్తి చితక బాదినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో సుబ్బన్నను పోలీసు స్టేషన్‌లో అప్పగించారన్నారు. పోలీసులు రాత్రి 10.30 గంటలకు విడిచిపెట్టగా ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. నువ్వు ఊర్లో ఎలా తిరుగుతావో చూస్తామని బెదిరించినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని వెంకటసుబ్బన్న గురువారం తన తండ్రి జీకే వెంగన్నతో చెప్పగా సాయంత్రం పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి ఏదైనా హాని జరిగితే దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులే బాధ్యులని ఫిర్యాదులో పేర్కొన్నారు.


