తుపాను దడ | - | Sakshi
Sakshi News home page

తుపాను దడ

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

● నీట మునిగిన మక్కజొన్న ● నేల రాలుతున్న పత్తి ● రైతన్నలను వెంటాడుతున్న కష్టాలు హాలహర్వి: మండలంలోని గూళ్యం సమీపంలో వేదా వతి నది ఉప్పొంగడంతో ఆంధ్ర – కర్ణాటక ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించాయి. అత్యవసర పనులకు పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

● నీట మునిగిన మక్కజొన్న ● నేల రాలుతున్న పత్తి ● రైతన్నలను వెంటాడుతున్న కష్టాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కంటికి కునుకు లేకుడా చేస్తున్నాయి. చేతికి వస్తాయనుకున్న దిగుబడులు నీటిపాలు కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.బుధవారం కురి సిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, వీధుల్లో వర్షపునీరు ప్రవహించింది.విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది.

నందవరం: మండలంలో కురిసిన వర్షాలు పత్తి రైతు లను తీవ్రంగా దెబ్బతీశాయి.వచ్చిన కాసింత పత్తి తీద్దామనుకునేలోపు వర్షం అడ్డుపడింది. పత్తి నేల రాలుతుందని,కాయలు కూల్లిపోతాయని, పత్తి రంగు మారుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఉయ్యాలవాడ: మండలంలో ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పంటలు వర్షపునీటిలో మునిగాయి. మొక్కజొన్న 225 హెక్టార్లు, మినుము 52, మిరప 260, పెసర 121, పత్తి, 58 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లో వర్షపునీరు చేరింది. పంట చేతికొచ్చే తరుణంలో వరదనీటి పాలవుతుండటంతో అన్నదాతలు కన్నీంటి పర్యంతమవుతున్నారు.

జూపాడుబంగ్లా: మండలంలోని తాటిపాడు గ్రామానికి చెందిన బోయ నరసింహ అనే వ్యక్తికి చెందిన మట్టిమిద్దె బుధవారం కూలింది. ఇంట్లో చెత్త ఊడ్చుతున్న రమణమ్మ అనే మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటకు పరుగులు తీసింది. ఇంట్లోని వంటసామగ్రి, నిత్యావసర వస్తువులు మట్టిలో కలిసిపోయాయి.

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ రహదారిలో భీమునిపాడు సమీపంలో ఉన్న గోదాము పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. చుట్టుపక్కల గ్రామాల రైతులు గోదాములో దాదాపు 3 వేల బస్తాల పప్పుశనగలు, వడ్లు నిల్వ ఉంచుకున్నారు. పైకప్పు ఎగిరిపోయి వర్షం కురవడంతో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

గూళ్యం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వేదావతి నది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement