కొలిమిగుండ్ల(అవుకు): పట్టణంలోని సెయింట్ మేరీ హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థి బుధవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కొలిమిగుండ్ల మండలం బెలుంకు చెందిన తోక సురేష్, ఇందిరమ్మ దంపతుల కుమారుడు నిఖిల్ (13) అవుకు సెయింట్ మేరీ స్కూల్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చారు. ఏం జరిగిందో గానీ బస్టాండ్‌కు సమీపంలో ఢిల్లీ బజార్ ఎదుట విద్యుత్ స్తంభం వద్ద విద్యార్థి విగతజీవిగా పడి ఉన్నాడు. తెల్లవారాక మృతదేహాన్ని స్థానికులు గమనించారు. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో పెట్టారు. తల్లిదండ్రులు, బంధువులు వచ్చినా బాలుడి మృతదేహాన్ని చాలాసేపటి వరకు చూపకపోవడంతో వారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని తల్లితండ్రులు కోపోద్రిక్తులయ్యారు. లోపలికి పోకుండా గేటు వేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. నలుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు రాగా నిఖిల్ మాత్రమే విద్యుత్ స్తంభం వద్ద మృతదేహంగా ప్రతక్ష్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రులను పరామర్శించారు. విద్యార్థులు అర్ధరాత్రి వేళ బయటకు ఎలా వెళ్లారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించడంతో వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతిపై అన్ని కోణాల్లో విచారించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


