శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఏటా శతచండీ హోమం జరిపించేవారని, అయితే లోక కల్యాణం కోసం ఈ ఏడాది మొట్టమొదటిసారిగా దసరా ఉత్సవాల్లో సహస్ర చండీ సహిత మహా రుద్రహోమం జరిపించాలని ధర్మకర్తల మండలి తీర్మానించిందని చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో 11వ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. మొత్తం 20 అంశాలు చర్చించగా 18 అంశాలకు ఆమోదం, రెండు అంశాలను తిరస్కరించారు. ధర్మకర్తల మండలి సమావేశ తీర్మానాలను చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతి (సరస్వతి) అమ్మవారి ఆలయంలో రూ.3.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదించారు. వీటిలో రూ.3.13 కోట్లతో శాశ్వత పనులు, రూ.7 లక్షలతో తాత్కాలిక పనులు చేపట్టనున్నారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో శౌచాలయాలలో భక్తుల నుంచి వినియోగ రుసుము వసూలు చేయకూడదని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. నందీశ్వర డార్మెంటరీకి రూ.10 లక్షలతో మరమ్మతులు చేసే ప్రతిపాదనను ఆమోదించినట్లు, దసరా మహోత్సవాల్లో ఆలయ విద్యుద్దీకరణకు ఆమోదం తెలిపామని, పరిపాలన, సాంకేతిక అనుమతుల అనంతరం ఇ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలుస్తామన్నారు. డిసెంబరు 10వ తేదీ నుంచి శ్రీశైలంలోని ఐ.ఓ.సీ.ఎల్ పెట్రోల్‌బంక్‌ను దేవస్థానమే నిర్వహిస్తుందని తెలిపారు. దేవస్థానంలోని అన్ని సీసీ కెమెరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేసి భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, వాహనాల క్రమబద్ధీకరణ మొదలైన వాటిని ఏఐ ఆధారిత పరిష్కారాలతో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.


