● గుర్రపుడెక్కలో చిక్కుకొని
నాలుగు గేదెలు మృతి
● క్రిష్టిపాడు వద్ద కుందూనదిలో ఘటన
దొర్నిపాడు: ఇంటి వద్ద నుంచి ఏడు పాడిగేదెలు దాహం తీర్చుకునేందుకు సమీపంలోని కుందూ నదికి బయలు దేరాయి. యజమాని వచ్చేలోపే కుందూలోకి దిగి నీళ్లు తాగి ఎండల తీవ్రతకు కాస్త సేద తీరేందుకు నదిలోకి వెళ్లాయి. నీటి ప్రవాహం అధికం కావడంతో గుర్రపు డెక్కలో చిక్కుకొని ఊపిరి ఆడక నాలుగు గేదెలు మరణించగా మిగతా మూడింటిని ప్రాణాలతో కాపాడుకున్న ఘటన మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మడ్డి సుబ్బారావు పాడి గేదెలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకున్న ఏడు గేదెలను సోమవారం కుందూనదిలో నీళ్లు తాపుకొని ఓళ్లు శుభ్రం చేసుకోవచ్చని తోలారు. నదిని చూడగానే గేదెలు పరుగులు తీయగా యజమాని వచ్చేలోపే జరగరాని నష్టం జరిగింది. నీళ్లు తాగిన అనంతరం ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన గేదెలు బ్రిడ్జికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కలో కూరుకుపోయాయి. ఈత కొట్టలేక నాలుగు గేదెలు మృత్యువాత పడ్డాయి. మరో మూడింటిని కాపాడుకోగలిగారు. ఇందులో రెండు పడ్డదూడలు, ఒకటి పాలిచ్చే గేదె, మరో గేదె రెండు రోజుల్లో ఈనేందుకు వచ్చిందని రైతు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. గేదెలు సుమారు రూ.2 లక్షల విలువ చేస్తాయని బాధితుడు విలపిస్తున్నాడు.
గేదెల కళేబరాలకు పోస్టుమార్టం
మృతి చెందిన రెండు పడ్డదూడలు ప్రవాహంలో గల్లంతు కాగా గుర్రపు డెక్కలో కూరుకుపోయిన రెండు గేదెలను అతికష్టం మీద వెలికి తీసి పశువైద్యాధికారి నాగశైలజ, జేవీఓ జమాల్‌బాషా పోస్టుమార్టం నిర్వహించారు. రెండు బర్రెలకు బీమా వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదకరంగా మారిన గుర్రపు డెక్క
నదికి ఏటా వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతం నుంచి భారీగా గుర్రపుడెక్క కొట్టుకొచ్చి క్రిష్టిపాడు వద్ద బ్రిడ్జికి అడ్డుపడి ప్రమాదకరంగా మారుతోంది. ఏటా గ్రామస్తులు దాన్ని తొలగించేందుకు కష్టపడుతుంటారు. ప్రస్తుతం నాలుగు పాడి గేదెల ప్రాణాలను బలితీసుకుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.


