● నీళ్ల కోసం తగాదా
● అన్నదమ్ములే.. పార్టీలు వేరు
● ఫిర్యాదుపై కేసు నమోదు చేయని పోలీసులు
ఆదోని: పొలాలకు నీరు మళ్లించుకునే విషయంలో తలెత్తిన వివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణ రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త, బాధితుడైన ఎర్రిస్వామి, దాడి చేసిన బీజేపీ కార్యకర్త మధు వీరిరువురూ స్వయాన అన్నదమ్ములు. మధుతో పాటు అతని ఇద్దరు అనుచరులు సోము, కేశవ అనే వ్యక్తులు కూడా దాడి చేశారు. ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో గాయపడిన ఎర్రిస్వామి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని బాధితుడు ఎర్రిస్వామి ఆరోపిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆస్పత్రిలో పరామర్శ
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కుమారుడు జయమనోజ్ రెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న ఎర్రిస్వామిని పరామర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జయమనోజ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ అని తెలిపారు. అయినప్పటికీ దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. కూటమి నాయకుల ఒత్తిడి కారణంగానే పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా పోలీసులు బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


