● ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
జీ.సంతోష్ కుమార్
కర్నూలు(సెంట్రల్): వెంటనే పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జీ. సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. మొత్తం 11 వేల పోస్టులతో భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు జి. సంతోష్ కుమార్ మాట్లాడారు. పోలీస్ శాఖలో 20వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో హోమంత్రి అనిత ప్రకటించారన్కానరు. మొత్తం 11, 639 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతుల వచ్చాయని డీజీపీ చెప్పారన్నారు. వెంటనే 11 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతామన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. టీచర్ ఉద్యోగాలను అమ్ముకొని దగా చేశారని ఆరోపించారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల పైన సరైన సమాచారం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ధర్నాలో నిరుద్యోగ జేఏసీ నాయకుడు నాగార్జున, వలంటీర్ అసోసియేషన్ నాయకుడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.


