కోసిగి: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకోమని చెప్పి 9 రోజుల్లోనే గడువు ముగించేసింది. దీంతో చాలా మంది అధికారుల నిర్లక్ష్యంతో భూ సమస్యలు, కులధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం అందక, చేనేత కార్మికులకు జౌళిశాఖ అధికారుల ఆమోద పత్రం, మత్స్య కారులు, డప్పు కళాకారులకు సర్టిఫికెట్లు రాకపోవడంతో పింఛన్ దరఖాస్తుకు అనర్హులుగానే మిగిలిపోయారు. జంపాపురం గ్రామానికి చెందిన ఇద్దరు బాధితురాలకు భూమి లేకపోయినా పదుల ఎకరాల్లో ఉన్నట్లు చూపి పింఛన్ రాకుండా చేశారు.
నా భర్త ఈశ్వరప్ప ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నాకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు అప్పులు చేసి వివాహం జరిపించాం. నా భర్త పేరిట 90 సెంట్లు భూమి గ్రామంలోనే ఉంది. భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా ఆన్‌లైన్‌లో నా పేరిట ఆర్లబండ గ్రామంలో 70 ఎకరాల మెట్ట, 4 ఎకరాల మాగాణి ఉన్నట్లు చూపుతోంది. ఆ భూములను నా ఆధార్ కార్డుకు లింక్ చేశారు. ఇప్పుడు పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ అయ్యింది. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ సరైనా సమాధానం చెప్పడం లేదు. పింఛన్ దరఖాస్తు సమయం ముగిసిపోయింది. రోజూ కూలి పనికి వెళ్లి బతికే నాకు పింఛన్ వస్తే కాస్త ఆసరాగా ఉంటుందని ఆశపడ్డాను. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు పింఛన్ రాకుండా పోయింది.
– కొరివి మంగమ్మ, జంపాపురం


