కర్నూలు(అర్బన్): జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో బీసీ ఓటర్లు సింహభాగంగా 9,05,611 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవల క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బంది అన్ని గ్రామ పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించి జాబితాలను కూడా ప్రచురించారు. మొత్తం 12,50,166 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా, వీరిలో బీసీ ఓటర్లు 9 లక్షలకు పైగా ఉండడం గమనార్హం. వీరిలో మహిళలు 4,56,520, పురుషులు 4,48,982, ఇతరులు 109 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 7538 మంది అధికంగా ఉన్నారు. అలాగే మొత్తం ఎస్‌టీ ఓటర్లు 17,119 మంది, ఎస్సీ ఓటర్లు 2,33,881 మంది, ఇతర కులాలకు సంబంధించిన ఓటర్లు 93,555 మందిగా అధికారులు గుర్తించారు. కాగా, అత్యధికంగా కర్నూలు రూరల్ మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో 77,575 మంది ఓటర్లు ఉన్నారు. ద్వితీయ స్థానంలో కోడుమూరు మండలలోని 13 గ్రామ పంచాయతీల్లో 60,365 మంది, తృతీయ స్థానంలో గోనెగండ్ల మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో 59,816 మంది ఓటర్లు ఉన్నారు.
రమణీయం.. నవరత్న రథోత్సవం
మంత్రాలయం: శ్రీమఠం ప్రాంగణంలో సోమవారం నవరత్న రథంపై ప్రహ్లాదరాయులు అంగరంగ వైభవంగా విహరించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మ కుంకుమార్చన చేసి మహామంగళహారతులు ఇచ్చారు. అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందవనానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులకు మంత్రాక్షితలు ఇచ్చి పీఠాధిపతి ఆశీర్వదించారు.
జిల్లాలో వర్షాలు తేలికపాటికే పరిమితం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు తేలికపాటి నుంచి ఒక మోస్తరుకే పరిమితమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 18 మండలాల్లో వర్షాలు కురిశాయి. జిల్లా సగటున 4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఓర్వకల్‌లో 18.4, వెల్దుర్తిలో 11.8, హొళగొందలో 8.6, మద్దికెరలో 7.8, ఆలూరులో 7.4, ఆదోని–1లో 7.2, గూడూరులో 6.2 మి.మీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడ్డాయి. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉండగా.. 21 రోజుల్లో 27.1 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. రెండు రోజులుగా కరుస్తున్న వర్షాల వల్ల ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలకు ఎలాంటి ఉపయోగం లేదని తెలుస్తోంది. ప్రస్తుత వర్షాలతో ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు చేసే అవకాశం లేకుండాపోయింది. నాలుగైదు మండలాల్లో మాత్రమే కొంత భారీ వర్షం కురిసింది.
ముగిసిన మద్యం దుకాణాల రెన్యూవల్ ప్రక్రియ
● 16 దుకాణాలకు ముందుకు రాని
లైసెన్స్‌దారులు
● ఈనెల 23 వరకు గడువు పొడిగింపు
కర్నూలు: జిల్లాలో మద్యం దుకాణాల అనుమతుల పునరుద్ధరణకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం రాత్రితో ముగిసింది. 106 మద్యం దుకాణాలకు 90 మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియలో భాగంగా రుసుములు చెల్లించి ప్రక్రియను పూర్తి చేసుకుని పునరుద్ధరించుకున్నారు. మరో 16 మంది తమ దుకాణాల రెన్యూవల్‌కు ముందుకు రాలేదు. ఇందులో భాగంగా కర్నూలులో 2, కోడుమూరులో 2, ఎమ్మిగనూరులో 4, ఆదోని, ఆలూరులో ఒక్కొక్కటి, పత్తికొండ, కోసిగిలో మూడేసి చొప్పున దుకాణదారులు రెన్యూవల్ చేసుకోవడానికి ముందుకు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈనెల 23వ తేదీ రాత్రి వరకు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు తెలిపారు.
రూ.2.50 లక్షల విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి సోమవారం ఏలూరుకు చెందిన స్వయంప్రకాశం కార్తిక్ రూ.2,50,000 విరాళాన్ని దేవస్థాన ఏఈఓ ఫణిధర్ ప్రసాద్‌కి అందజేశారు. దాతకు దేవస్థానం తరపున స్వామి వారి శేష వస్త్రాన్ని, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.


