26న కానిస్టేబుల్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ | - | Sakshi
Sakshi News home page

26న కానిస్టేబుల్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌, జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కళాశాలలో 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు ఈనెల 26న పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహించేందుకు కర్నూలు రెండో బెటాలియన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ ముగిసిన కానిస్టేబుళ్లకు ఈనెల 7న పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌ నిర్వహించనున్నట్లు డీజీపీ తొలుత మెమో జారీ చేశారు. అయితే ఆకస్మికంగా వాయిదా వేయడంతో శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు ఆందోళనకు లోనయ్యారు.

వైసీపీ ప్రభుత్వంలోనే

నోటిఫికేషన్‌, ఫిజికల్‌ టెస్టులు

రాష్ట్ర వ్యాప్తంగా 6,100 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌కు 2022 నవంబర్‌ 28న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అప్పట్లోనే అభ్యర్థులందరికీ ఫిజికల్‌ టెస్టులు, పరుగుపందెం పకడ్బందీగా నిర్వహించారు. ఈ క్రమంలో నిరుద్యోగ జేఏసీ పేరుతో కోర్టులో కేసు వేయడంతో రాత పరీక్ష నిలిచిపోయింది. అనంతరం టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే 2025 జూన్‌ 1న రాత పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన 629 మందికి కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌, పోలీసు శిక్షణ కళాశాలలో 9 నెలల పాటు శిక్షణ పూర్తయింది. వారికి ఈనెల 26న పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహించేందుకు కమాండెంట్‌ దీపిక పాటిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

సమన్వయంతో విజయవంతం చేయండి

ట్రైనీ పోలీసులకు నిర్వహించనున్న పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌పై సోమవారం కమాండెంట్‌ దీపిక పాటిల్‌ అధికారులతో పటాలంలో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని దీపిక పాటిల్‌ ఆదేశించారు. ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి టీజీ భరత్‌, కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయప్రవీణ్‌, కలెక్టర్‌ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హాజరవుతారన్నారు. సమావేశంలో అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా, అడిషనల్‌ కమాండెంట్‌ నాగేంద్రరావు, అసిస్టెంట్‌ కమాండెంట్లు వెంకటరమణ, బాషా, వెంకట శివుడు, డీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌, డీఎస్పీలు ఓబులేసు, సుధాకర్‌ రెడ్డి, సీఐలు విక్రమసింహ, వెంకటకృష్ణా రెడ్డి, ఆర్‌ఐలు జావేద్‌, నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రతిభ కనపరచిన వారికి అవార్డులు

శిక్షణ కాలంలో ప్రతిభ కనపరచిన వారికి బెస్ట్‌ ఔట్‌డోర్‌, బెస్ట్‌ ఇన్‌డోర్‌, బెస్ట్‌ ఓవరాల్‌, బెస్ట్‌ ఫైరింగ్‌, బెస్ట్‌ పరేడ్‌ కమాండర్‌, బెస్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తదితర విభాగాల్లో అవార్డులను అందజేయనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ట్రైనీ కుటుంబం నుంచి ఇద్దరికి మాత్రమే గ్యాలరీలోకి అనుమతించనున్నారు. ఇందుకోసం ప్రతి ట్రైనీకి రెండేసి పాసులు పంపిణీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement