కర్నూలు: కర్నూలులో గణేష్ నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో సోమవారం సాయంత్రం ఎస్పీ సమావేశమై దిశానిర్దేశం చేశారు. శోభాయాత్ర సాగే రహదారులు, కూడళ్లు, నిమజ్జనం వేళ ఎలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఉంచాలన్నారు. విధుల్లోని పోలీసు అధికారులు, సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించకుండా భక్తులు, ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం శోభాయాత్ర సాగే మార్గాలను కాలినడకన పరిశీలించారు. రాంబొట్ల దేవాలయం వద్ద కొలువైన గణపతిని సందర్శించి పూజలు నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు మధుసూదన్ రావు, కేశవరెడ్డి, మారుతి శంకర్, విక్రమసింహ, శ్రీధర్, శేషయ్య తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.


