● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల(అర్బన్): జర్నలిస్టులు ఏ చిన్న వార్త రాయాలన్నా ఎవరు ఏ కేసు పెడతారో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని, వార్తలపై వివరణ ఇచ్చుకోకుండానే కూటమి నేతలు కేసులు పెట్టడం దారుణమని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు అవుతున్నా జర్నలిస్టుల రక్షణ చట్టాలపై మీన మేషాలు లెక్కిస్తోందన్నారు. స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించాలన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ.. వార్తల సేకరణ, ప్రచురణల్లో జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. జర్నలిస్టుకు ఏది జరిగినా అసోసియేషన్ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జ్ జయరాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మద్దయ్య యాదవ్, గిరిబాబు సాగర్ ఎన్నికయ్యారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా జగన్‌మోహన్, కోశాధికారిగా మస్తాన్, ఉపాధ్యక్షులుగా నిజాముద్దీన్, నరసింహారెడ్డి, సుబ్బరాయుడు, నాగన్న, సహాయ కార్యదర్శులుగా వేణుగోపాల్, రంగస్వామి, చంద్రబాబు, రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎన్‌ఏజే నాయకులు అమరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు ఉసేన్‌ఖాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, రామకృష్ణారెడ్డి, మౌలాలి, శేఖర్, శ్రీనివాసులు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


