● భర్త చనిపోయిన వారానికే భార్య మృతి
● అందరూ ఉన్నా అనాథగా అంత్యక్రియలు
ఆళ్లగడ్డ: కష్టాలు చుట్టు ముట్టినా... పేదరికం రోడ్డుపాలు చేసినా.. కొడుకులు పెడదోవ పట్టినా.. ఆ దంపతులు ఒకరికొకరుగా జీవించారు. మరణంలోనూ నీ వెంటే నేను అన్నట్లుగా వారం రోజుల వ్యవధిలో వృద్ధ దంపతులు కన్నుమూశారు. వారం రోజుల క్రితం భర్త మృతి చెందగా, భార్య శనివారం రాత్రి మృతి చెందింది. రక్త సంబంధీకులు ముఖం చాటేసిన వేళ.. సమాజ సేవకులు మానవత్వాన్ని చాటుకుని ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని సద్ధాం కాలనీలో నివాసమున్న వడ్డె వెంకటమ్మ (88), ఆమె భర్త సుబ్బరాయుడు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు మద్యం, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. కొంత కాలంగా దంపతులు ఇళ్లు కూడా లేక చెట్టుకింద పట్టలు కట్టుకుని అందులో ఓ మంచం వేసుకుని కడు దుర్భరమైన జీవితం గడిపారు. కన్న కొడుకులు, బంధువులు ఉన్నప్పటికీ వారిని ఆదరించే దిక్కులేక అత్యంత దయనీయ స్థితిలో జీవితాన్ని వెళ్లదీశారు. ఈ క్రమంలోనే సుబ్బరాయుడు వారం రోజుల కిత్రం మృతి చెందారు. భర్త మృతి చెందడంతో తీవ్ర ఆవేదనతో వెంకటమ్మ కూడా శనివారం రాత్రి మృతి చెందింది. అయితే మత్తుపదార్థాలకు బానిసలైన ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేక పోవడంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తామున్నామంటూ సమాజ సేవకుడు ఈపనగండ్ల శ్రీనివాసులు ముందుకు వచ్చి హిందూ సంప్రదాయ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.


