రుద్రవరం: ఆర్.కొత్తూరు గ్రామానికి చెందిన బండారు దస్తగిరి కుమారుడు గౌతమ్(12) ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం గ్రామంలో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి నేల కాస్త బురదగా మారింది. దస్తగిరి తన ఇంటి బయట ప్రాంగణం చుట్టూ ఇనుప తీగతో ఫెన్సింగ్‌లా ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఓ తీగ ఫెన్సింగ్ తాకడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. గౌతమ్ తీగను గమనించకుండా ఫెన్సింగ్ తీగను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంధం వీర రాఘవరెడ్డి బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించారు.
పొలంలోనే కుప్పకూలిన రైతు
కొలిమిగుండ్ల: పంట పొలంలోనే ఓ రైతు గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. ఈవిషాదకర సంఘటన ఆదివారం బి.ఉప్పులూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కుమ్మరి నాగన్న(68) నాలుగు ఎకరాల పొలంలో మిరప సాగు చేశాడు. తెల్లవారు జామున వర్షం కురవడంతో పంటలో నీళ్లు నిల్వ ఉన్నాయని వాటిని బయటకు పంపించేందుకు భార్య ఎల్లమ్మ, కోడలు భూలక్ష్మితో కలిసి వెళ్లాడు. పని చేస్తుండగానే ఒక్క సారిగా అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కళ్ల ముందే భర్త మృతితో భార్య శోకసంద్రంలో మునిగిపోయింది. కరోనాలో కుమారుడు సుబ్రమణ్యం మృతి చెందగా ఇద్దరు మనవళ్లను వ్యవసాయం చేస్తూ చదివిస్తున్నాడు. ఇప్పుడు అతను కూడా మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


