కోడుమూరు రూరల్: కోడుమూరులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగ హల్ చల్ చేశాడు. పట్టణంలోని ఓ మద్యం షాపు, మెడికల్ షాపునకు సంబంధించిన షట్టర్లను గడ్డపారతో ఎత్తి చోరీకి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో గల మల్లికార్జున వైన్ షాపు షట్టర్‌ను గడ్డపారతో మెండి గుర్తు తెలియని దుండగుడు లోపలికి చొరబడ్డాడు. అక్కడ రూ.16వేల నగదుతో పాటు, మూడు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. అలాగే పట్టణంలోని ఓ మెడికల్ దుకాణంలో చొరబడేందుకు ప్రయత్నించగా షటర్ తెరుచుకోలేదు. అనంతరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న మెడికల్ షాపులోకి చొరబడి రూ.10వేలకు పైగా నగదును ఎత్తుకెళ్లాడు. బాధితుల ద్వారా ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు ఆయా దుకాణాలను పరిశీలించారు. మద్యం దుకాణంలో సీసీటీవీ పుటేజీని పరిశీలించి దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.కాగా పట్టణంలో ఒకే రోజు రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడడంతో పాటు మరో దుకాణంలో దుండగుడు చోరీకి యత్నించడంతో కోడుమూరులో వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


