పచ్చని పొలాన్ని తలపిస్తున్నా.. ఇది కర్నూలు నగర నడిబొడ్డున ప్రవహిస్తున్న కేసీ కెనాల్. ప్రస్తుతం నీటి ప్రవాహం లేక గుర్రపు డెక్కతో నిండిపోయింది. అడుగడుగునా మురుగు నీరు కేసీ కెనాల్‌లోకి చేరుతుండటంతో ప్రస్తుతం మురికి కాలువను తలపిస్తోంది. తొమ్మిది రోజుల పాటు భక్తితో కొలిచిన వినాయక నిమజ్జనానికి ఈ మురుగునీటి కాలువ వేదికవుతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో కేసీ కెనాల్‌లోనే నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ ప్రకటించినా.. మూడు రోజుల నిమజ్జనోత్సవం చూసి వినాయకుడు కన్నీరు కారుస్తున్నాడు. కాలువలో పడేయడంతో తమ పని అయిపోయిందన్నట్లుగా భక్తులు.. మురుగునీరు నిలిపి నిమజ్జనోత్సవం కానిచ్చామని నాయకులు, అధికారులు.. వెరసి భక్తిభావం మురుగునీరులో మునిగిపోతోంది. కిలోమీటర్ల దూరం పెరిగిపోయిన గుర్రపు డెక్కను తొలగించేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయింది. ఇక పైపులు ఏర్పాటు చేసి మురుగునీటిని కేసీ కెనాల్‌లోకి పారిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. కాలువలో కొద్ది దూరం గోడలు కట్టేసి మురుగునీటిని నిలిపేయడం చూస్తే భక్తుల మనోభావాలను ఏస్థాయిలో గౌరవిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. చివరి రోజు కొద్దిపాటి నీరు విడుదల చేసినా.. గుర్రపుడెక్కను దాటుకొని నీళ్లు రావడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
గుర్రపు డెక్కతో నిండిన కేసీ కెనాల్
కేసీ కెనాల్‌లో పేరుకుపోయిన మురుగు నీరు
అశోక్‌నగర్ వద్ద కేసీలో కలుస్తున్న మురుగు నీరు
కేసీలో అడుగడుగునా ఇలాంటి మురుగు ధారలే


