సంజామల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. రేయింబవళ్లు గ్రావెల్ అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటోంది. కొందరు వ్యక్తులు రామిరెడ్డిపల్లె గ్రామంలో ఎర్రకొండను తవ్వి మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజులుగా ఎర్రమట్టి అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎర్రమట్టి అక్రమ తరలింపుపై ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేసినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులకు కమీషన్లు ఇస్తే చాలు అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఎర్రమట్టిని తరలించడానికి అధికారపార్టీ నాయకులకు టిప్పర్‌కు రూ.300 కమీషన్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రోజుకు 50 ట్రిప్పులుపై గానే ఎర్రమట్టి తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా స్థానిక నాయకులు, అధికారులను సంప్రదిస్తే చాలు అక్రమంగా మట్టిని తీసుకెళ్లవచ్చుని బాహాటంగా చర్చ జరుగుతోంది.


