● ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
తుగ్గలి: రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. జొన్నగిరి వద్ద ఎండిన సజ్జ, కంది పంటలను శుక్రవారం వారు పరిశీలించారు. రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు ఎండిపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని, వాటిని తీర్చే మార్గం లేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం చాలా బాధాకరమన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోయి గ్రామాల్లో తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పశుగ్రాసం, తాగునీరు కరువై పశుసంపద కబేళాలకు తరలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కరువు మండలాలు ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులకు రైతుకష్టాలు వినే తీరిక కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మౌనం వీడి కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలను ప్రకటించాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జిట్టా నాగేష్, మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు జగన్నాథరెడ్డి, నారాయణ నాయక్, వైస్ ఎంపీపీలు మల్లికార్జునరెడ్డి, నాగప్ప, లోకనాథరెడ్డి, అమరనాథరెడ్డి, తేరప్ప, గంగాధర, రామాంజి పాల్గొన్నారు.


