కర్నూలు (టౌన్): రైతుల సమస్యలను మంత్రి టీజీ భరత్ పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గానికి మాత్రమే కాదని, జిల్లాకు, రాష్ట్రానికి మంత్రి అన్నారు. కర్నూలు జిల్లా రైతుల సమస్యలపై ఏనాడైనా సమీక్షించడం, పంటల పరిస్థితిని పరిశీలించడం చేయలేదన్నారు. రెండున్నరేళ్లలో కర్నూలు, ఆదోని, కోడుమూరు తప్ప ఎక్కడా పర్యటించలేదన్నారు. కోడుమూరులో మంత్రి టీజీ పర్యటన వివాదాస్పదమైందన్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతే మంత్రిగా ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాకు ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు ఉన్నా.. ప్రయోజనం లేదన్నారు. ఇప్పటి వరకు ఎల్లెల్సీ, హెచ్చెల్సీలకు నీటి వాటా తీసుకురాలేకపోయారన్నారు. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా, గోరుకల్లు, ఎస్‌ఆర్‌బీసీ, పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకువచ్చారా... జీడీపీ నుంచి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ, డోన్ ప్రాంతాలకు తాగునీరు ఇచ్చారా.. ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
వెలిగొండకు తరలించి
సీమ గోంతు కోస్తారా?
ఆయకట్టు లేని వెలిగొండ రిజర్వాయర్‌కు నీటిని తరలించి రాయలసీమ రైతాంగం గొంతు కోస్తారా అని ఎస్వీ ప్రశ్నించారు. సీమ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉంటే శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. పోలవరంలో 75 టీఎంసీల సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల రూ. 30 వేల కోట్లు నష్టపోతున్నా.. కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా సీఎం చంద్రబాబునాయుడుకు, వెన్నుపోటు పార్టీకి చీమకుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. గత జూన్ , జూలై నెలలో పంటలు వేసుకోవాలని చెప్పి ఇప్పుడు నీళ్లు లేవని రైతులను నిలువునా ముంచారన్నారు. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితుల్లో వ్యవసాయాధికారులతో సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి కనీసం సమీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. అమరావతి, పోలవరం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి రైతాంగాన్ని అదుకోవాలన్నారు. రైతాంగం కోసం రూ. 3 వేల కోట్లు రిజర్వ్ చేయాలని సూచించారు.
వైఎస్సార్‌సీపీ పోరుబాట
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో రైతాంగ పరిస్థితుల గురించి మాట్లాడారన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, వారికి అండగా నిలవాలని తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. సాగునీరు, తాగునీరు అందించాలని, నష్టపోయిన రైతులు పరిహారం చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. జిల్లాలో రైతుల పరిస్థితులను తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తారన్నారు.
జిల్లాలో అన్ని మండలాలను
కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి
ఉచిత పంటల బీమా పథకాన్ని
అమలు చేయాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి


