ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.31కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.31కోట్లు

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

● పగిడ్యాలలో 39.4 డిగ్రీలు, కర్నూలులో 38.5 డిగ్రీలు నమోదు

కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో 14రోజులకు సంబంధించి హుండీని మంగళవారం లెక్కించారు. ఆలయ డప్యూటీ కమిషనర్‌ వాణి ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. భక్తులు స్వామి వారికి నగదు రూపంలో రూ.1,31,49,565 సమర్పించగా.. వెండి 14.500 కేజీలు, బంగారం 31.770 గ్రాములు వచ్చినట్లు ఈఓ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణాధికారి సుధాకర్‌రెడ్డి, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి తదితరులు పాల్గొన్నారు.

కేసీ కెనాల్‌లోనే

వినాయక నిమజ్జనం

కర్నూలు(సెంట్రల్‌): భక్తుల మనోభావాలు, కమిటీ సభ్యుల విజ్ఞప్తులకు అనుగుణంగా కేసీ కెనాల్‌లోనే వినాయక నిమజ్జనం నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీ కెనాల్‌లోనే నిమజ్జనోత్సవాన్ని నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. అదే విధంగా 600 మీటర్ల పరిధికి అనుగుణంగా అవసరమైన క్రేన్లు, భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ అవినాష్‌ జయసింహ, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

క్వింటా వేరుశనగ రూ.8,910

ఎమ్మిగనూరు టౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్వింటా వేరుశనగ గరిష్ట ధర రూ.8,910 పలికింది. మార్కెట్‌కు 440 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.4,730, మధ్యస్థ ధర రూ.7,300 ప్రకారం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.

వేసవిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు

కర్నూలు(అగ్రికల్చర్‌): అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మామూలుగా ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 33–34 డిగ్రీల వరకే నమోదవుతాయి. కానీ నేడు ఉష్ణోగ్రతలు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. పగిడ్యాలలో 39.4 డిగ్రీలు, ఉయ్యాలవాడలో 39.1, సంజామలలో 39.1, అవుకు 39, బనగానపల్లి 38.9, రుద్రవరం 38.8, ఆళ్లగడ్డ 38.8, కల్లూరు 38.6, కర్నూలు 38.5, ప్యాపిలి 38.4, మంత్రాలయం 38.3, శ్రీశైలం 38.3, నంద్యాల 38, వెల్దుర్తి 37.8, డోన్‌లో 37.8 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్‌ వినియోగం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం వరకు పెరగడం గమనార్హం.

పింఛన్ల దరఖాస్తుకు

నేడు ఆఖరు

కర్నూలు(అగ్రికల్చర్‌): చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండున్నరేళ్ల తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం కల్పించింది. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు గడువు విధించింది. ఇందులో ఏడు పని దినాలు మాత్రమే ఉండగా.. ఇప్పటికే ఆరు పని దినాలు పూర్తయ్యాయి. పింఛన్లకు సచివాయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి ఉమ్మడి జిల్లాలో పింఛన్లకు 70,226 దరఖాస్తులు అప్‌లోడ్‌ అయ్యాయి. కర్నూలు జిల్లాలో 672 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా 37,461 దరఖాస్తులు.. నంద్యాల జిల్లాలో 516 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా 32,765 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 786 దరఖాస్తులను.. నంద్యాల జిల్లాలో 620 దరఖాస్తులను ఆమోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement