అధర్మ మెనూ! | - | Sakshi
Sakshi News home page

అధర్మ మెనూ!

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

అతిథుల కోసమే ప్రత్యేక వంటలు

శ్రీశైలంటెంపుల్‌: భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, వారు సమర్పించే సొమ్ము వృథా కాకుండా చూసుకునేందుకు ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమిస్తుంది. శ్రీశైల దేవస్థానంలోని ధర్మకర్తల మండలి సభ్యులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా నిర్వహించే ధర్మకర్తల మండలి సమావేశానికి వచ్చే వీరి కోసం అన్నదాన భవనం నుంచి ప్రత్యేక మెనూతో వంటకాలు సిద్ధం చేయాలి. వీరికే కాకుండా వీరితో పాటు వచ్చిన వారికి కూడా వీటిని వడ్డించాలి. ప్రతి నెలా ప్రత్యేక వంటకం పేరుతో భక్తులు సమర్పించిన సొమ్మును వృథా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా ప్రత్యేక వంటకాల్లో దేవస్థానాల్లో నిషేధమైన ఉల్లి, వెల్లుల్లి వినియోగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

స్నాక్స్‌గా జీడిపప్పు పకోడి

శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు దర్శనం అనంతరం దేవస్థాన అన్నదాన భవనంలో అన్నప్రసాదాలను స్వీకరిస్తారు. భక్తులకు ఉదయం 11.30గంటల నుంచి స్వీటు, కర్రి, ఆకుకూరపప్పు, చట్నీ, వైట్‌ రైస్‌, సాంబారు, మజ్జిగ భోజనంగా అందిస్తారు. సాయంత్రం ఉప్మా, పప్పుల పొడి, వీలునుబట్టి పెరుగన్నం, సాంబారన్నం అందిస్తారు. ట్రస్ట్‌బోర్డు సమావేశానికి వచ్చే సభ్యులకు దేవస్థాన అన్నదాన భవనం నుంచి ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయాలి. ఇందుకోసం అన్నదాన విభాగం పర్యవేక్షకులు ప్రత్యేక మెనూ సిద్ధం చేసుకోవాలి. మంగళవారం నిర్వహించిన 10వ ధర్మకర్తల మండలి సమావేశానికి ఉదయం టిఫిన్‌ కోసం పొంగలి, వడ, సాంబారు, చట్నీ సిద్ధం చేశారు. అలాగే సమావేశం జరుగుతున్నప్పుడు స్నాక్స్‌గా జీడిపప్పు పకోడి(ఉదయం), టీ, కాఫీ, పల్లీల పకోడి(సాయంత్రం), మధ్యాహ్నం భోజనం డబుల్‌ మిటా స్వీటు, వెజిటబుల్‌పలావ్‌, మిక్స్‌ వెజిటబుల్‌కర్రి, ఆకుకూరపప్పు, రసం, వైట్‌రైస్‌(పొయ్యి మీద చేసిన), పల్లీల పచ్చడి(రోటి పచ్చడి), అలూప్రై, సాంబారు, పెరుగు, అప్పడాలు, మిరపకాయబజ్జీ సిద్ధం చేశారు. ఇలా ప్రతి నెలా సమావేశానికి వచ్చినప్పుడు ప్రత్యేక మెనూ ఉంటుందని తెలుస్తోంది. మొత్తం 23మంది ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఉంటారు. వీరితో పాటు వారి భర్తలు, భార్యలు ఉంటారు. అలాగే వారితో పాటు వచ్చిన వారికి కూడా ఈ ప్రత్యేక వంటకాలే వడ్డించాలి. అన్నదాన భవనంలో అన్నప్రసాదం స్వీకరించకుండా ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ప్రత్యేకమైన వంటకాలు ఆరగించడంపై విమర్శలున్నాయి.

అన్నదాన భవనం నుంచి టిఫిన్‌

శ్రీశైల దేవస్థానంలో పది నెలల క్రితం చంద్రబాబు ప్రభుత్వం చైర్మన్‌, 16మంది సభ్యులు, మరో ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులతో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసింది. క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, పలు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వీరిని ఏర్పాటు చేసింది. ధర్మకర్తల మండలి ప్రతినెలా ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 10 సమావేశాలు నిర్వహించారు. సమావేశానికి వచ్చిన ప్రతిసారి వీరికి వసతి(ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు), అన్నదాన భవనం నుంచి టిఫిన్‌, భోజనం అందిస్తారు. అలాగే మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవి దర్శనంతో పాటు వేదాశీర్వచనం కల్పిస్తారు. అంతేకాకుండా వీరికి ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌(టీఏ) అందిస్తారు. ప్రతిరోజు వీరి లెటర్‌కు వీఐపీ బ్రేక్‌ (మల్లన్న స్పర్శదర్శనం) టికెట్లు అందిస్తారు.

నిషేధిత వస్తువులైన ఉల్లి, వెల్లుల్లి వినియోగం?

ట్రస్ట్‌బోర్డు సభ్యుల కోసం ప్రత్యేకంగా చేసే వంటకాలు అన్నదాన భవనంలోనే చేస్తారు. అయితే దేవస్థాన అన్నదాన భవనంలో భక్తులకు సైతం అన్నప్రసాదం సిద్ధం చేస్తారు. భక్తులు మల్లన్న అన్నప్రసాదంగా భావించి స్వీకరించే భోజనం, టిఫిన్‌లో నిషేధిత వస్తువులైన ఉల్లి, వెల్లుల్లి వినియోగించరు. అయితే ధర్మకర్తల మండలి సభ్యులకు మాత్రం ఉల్లి, వెల్లుల్లి బయటి నుంచి తెప్పించి వినియోగించి వంటకాలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా దేవస్థాన పర్యటనలు, స్వామిఅమ్మవార్ల దర్శనానికి విచ్చేసే అతిథులు, వీవీఐపీలు, వీఐపీలకు సైతం ఉల్లి, వెల్లుల్లి వినియోగించి ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేస్తారని సమాచారం.

ధర్మకర్తల మండలి సభ్యులకు

ప్రత్యేక మెనూ

అన్నదాన భవనంలో తయారీ

ఉల్లిపాయ, వెల్లుల్లి వినియోగం?

శ్రీశైల క్షేత్ర సందర్శనకు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసే అతిథులను గౌరవించడం కోసం మాత్రమే కొన్ని ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తాం. వంటకాలలో నిషేధిత వస్తువులైన ఉల్లి, వెల్లుల్లి వినియోగించే ప్రసక్తే లేదు. మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలకు తరలివచ్చే జిల్లా అధికారుల బృందానికి, సిబ్బందికి ప్రత్యేకంగా వంట మనుషులను, ప్రత్యేక పొయ్యి ఏర్పాటు చేసి వంటలు సిద్ధం చేస్తాం. భక్తులకు సిద్ధం చేసే అన్నప్రసాదం పవిత్రంగా తయారు చేస్తాం. త్వరలో అతిథుల కోసం దేవస్థాన అన్నప్రసాద భవనం కాకుండా ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేసి, చెఫ్‌, వడ్డనకు మనుషులను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. – ఎం.శ్రీనివాసరావు,

శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement