చివరి చూపు లేకుండా అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

చివరి చూపు లేకుండా అంత్యక్రియలు

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

శ్రీశైలంటెంపుల్‌: సొంత ఊరు, బంధువులు, స్నేహితులు ఉన్నా..అత్యంత దయనీయంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండడంతో సొంత ఊరికి కూడా తీసుకెళ్లలేక సున్నిపెంట శ్మశానంలో ఖననం చేశారు. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న బంధువులు మినీవ్యాన్‌లో శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అప్పటికే ఆత్మహత్య చేసుకుని మూడు రోజులు కావడంతో మృతదేహాల నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో మృతదేహాలకు సున్నిపెంట గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు సుధాకర్‌ పెద్దనాన్న కుమారులు, సుధాకర్‌ పెద్ద అక్క ఆదిలక్ష్మీ భర్త గోగుల రాముడు, ఇతర కుటుంబ సభ్యులు సుమారు పది మంది కన్నీటి రోదనల నడుమ అత్యంత దయనీయంగా దహనసంస్కారాలు నిర్వహించారు. సొంత గ్రామం, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఉన్నా చివరి చూపుకు సైతం నోచుకోలేదు. ఆరోగ్యం బాగాలేదని, చూపించుకుని వస్తామని చెప్పి అనంత లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్వంతమయ్యారు. ‘నేను వస్తానన్నా వద్దని, మేమే వస్తాం అని చెప్పి కడసారి చూపుకు కూడా నోచుకోకుండా శివయ్య చెంతకు వెళ్లింది’ అని ఆదిలక్ష్మీ భర్త రోదిస్తుంటే అక్కడ ఉన్నవారి కళ్లలో నీళ్లు తిరిగాయి.

దేవస్థానం, పోలీసు శాఖ నిర్లక్ష్యం వీడేనా?

శ్రీశైలంలో ఉన్న పలు సత్రాలను, వసతి గదులను దేవదాయ ధర్మదాయ నిబంధనల మేరకు నిర్వర్తిస్తున్నారా, అతిక్రమిస్తున్నారా అనే విషయాలపై తరచూ తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. సత్రాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి తగు జాగ్రత్తలు, సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనల మేరకు గదులు కేటాయిస్తున్నారో, లేదో తరచూ తనిఖీలు చేయాలని భక్తులు పేర్కొంటున్నారు.

సున్నిపెంట శ్మశానంలో

ఐదు మృతదేహలకు ఖననం

చివరి చూపునకు నోచుకోని

బంధువులు, స్నేహితులు

పది మంది కుటుంబ సభ్యుల హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement