వేదమూర్తి.. విశ్వకీర్తి | - | Sakshi
Sakshi News home page

వేదమూర్తి.. విశ్వకీర్తి

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

రాఘవేంద్రుల చరిత్ర

నేటి నుంచి రాఘవేంద్రుల 355వ

ఆరాధన మహోత్సవాలు

31న మహా రథోత్సవం

సప్తరాత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

మంత్రాలయం: విశ్వకీర్తిని గడించిన వేదమూర్తి శ్రీ రాఘవేంద్రస్వామి. వేదభూమి మంత్రాలయంలో వెలుగొందుతూ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న పరిమళాచార్యుడు. కోటి భక్తుల కల్పతరువుగా వర్ధిల్లుతూ భువన మోహనుడిగా విఖ్యాతి. సశరీరంగా చింతామణి సదృశ్యులైన శ్రీ రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో 7 రోజుల పాటు వేడుకలు దేదీప్యమానంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దేశం నలుమూలల నుంచి భక్తులు వేడుకలకు తరలిరానున్నారు. దాదాపు 3 లక్షలకుపైగా భక్తుల తరలివచ్చి స్వామి సేవలో తరించనున్నారు. ఉత్సవాలను పురష్కరించుకుని ఇప్పటికే వేదభూమి విద్యుద్దీప కాంతులతో వెలుగులీనుతోంది.

శాస్త్రోక్త పూజలు.. సాంస్కృతిక వేడుకలు

సప్తరాత్రోత్సవాల్లో ఏడు రోజులు ఎంతో పవిత్రంగా ఇక్కడ పూజోత్సవాలు నిర్వహిస్తారు. వేకువజామున సుప్రభాత సేవతో ఇక్కడ పూజలు ప్రారంభమవుతాయి. మూల బృందావన నిర్మల్య విసర్జన, జల, పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు, మహా మంగళహారతులు, విశేష అలంకరణలు ఉంటాయి. పూజా మందిరంలో ప్రతిదినం సంస్థాన పూజలో భాగంగా మూల, జయ, దిగ్విజయ రాముల పూజోత్సవాలు కడు వైభవంగా జరుగుతాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు చెక్క, అంబారీ, రజత, స్వర్ణ, నవరత్న రథోత్సవాలు ఉంటాయి. గ్రామ దేవతకు విశేషాలంకరణ పూజోత్సవాలు నిర్వహిస్తారు. భక్తులకు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు కల్పిస్తారు. యోగీంద్ర మంటపంలో జాతీయస్థాయిలో పేరుగాంచిన నృత్య, సంగీత, నాటక కళాకారులచే ప్రదర్శనలు నిర్వహిస్తారు.

భక్తులకు ఏర్పాట్లు

ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు పలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. భక్తుల వసతి కోసం 5 లక్షల పరిమళ ప్రసాదాలు తయారు చేశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అన్నపూర్ణ భోజనశాల, నదీ తీరం, సీఆర్వో కార్యాలయం, 200 గదుల సముదాయంతో శౌచాలయాలు ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో వరద నీటి పారుదల లేకపోవడంతో పుణ్య స్నానాలకు ప్రత్యేక షవర్లు ఏర్పాటు చేయనున్నారు. మఠం సీఆర్‌ఓ, ప్రధాన ముఖధ్వారం, మఠం ప్రాకారం, అన్నపూర్ణ భోజనశాల దారిలో వాటర్‌ ప్లాంట్లు నెలకొల్పారు. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌–1 శ్రీనివాసరావు, మేనేజర్‌–2 వెంకటేష్‌జోషి, మేనేజర్‌–3 శ్రీపతిఆచార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సురేష్‌ కోనాపూర్‌, పీఆర్వో నరసింహమూర్తి ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.

ఉత్సవ విశేషాలు

గురువారం సాయంత్రం శ్రీమఠం శిఖరాన ధ్వజారోహణతో ఉత్సవాలకు అంకురార్పణ ఉంటుంది. ధాన్యపూజ, గోవు, తురగ పూజ, ప్రార్థనోత్సవం కానిస్తారు. ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాల సమర్పణ ఉంటుంది.

శుక్రవారం పరిమళ తీర్థం కోనేరులో ఉత్సవమూర్తి తెప్పోత్సవంతోపాటు శాఖోత్సవం, రజత మంటపోత్సవం చేపడతారు.

శనివారం పూర్వారాధన సందర్భంగా రజత సింహవాహనంపై ప్రహ్లాదరాయల ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం యోగీంద్ర మంటపంలో ప్రముఖులకు అనుగ్రహ ప్రశస్థి అవార్డు ప్రదానం గావిస్తారు.

ఆదివారం మధ్యారాధన పురష్కరించుకుని రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేస్తారు. రాత్రి గజవాహనోత్సవంతోపాటు రజత, సువర్ణ రథోత్సవాలు ఉంటాయి.

సోమవారం ఉత్తరారాధన సందర్భంగా క్షేత్రంలో రాఘవేంద్రుల మహా రథోత్సవం అంగరంగ వైభవంగా చేపడతారు. హెలికాఫ్టర్‌తో పుష్పవృష్టి ఉంటుంది.

మంగళవారం పూర్వపు పీఠాధిపతి సుజ్ఞానేంద్రుల ఆరాధన, అశ్వవాహన సేవలు కానిస్తారు.

బుధవారం సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకి, చెక్క, వెండి, బంగారు రథోత్సవాలు కానిస్తారు.

మూలరూపం : శంఖు కర్ణ

గోత్రం : గౌతమి

తండ్రి : తిమ్మన భట్‌

తల్లి : గోపికాంబ

జననం : క్రీ.శ.1595 మన్మథనామ

సంవత్సరం పాల్గుణ

శుద్ధ సప్తమి, గురువారం

జన్మ నక్షత్రం : మృగశిర

జన్మభూమి : భువనగిరి, కర్ణాటక

పూర్వ నామం : వెంకటనాథుడు

వివాహం : క్రీ.శ.1614, ఆనందనామ

సంవత్సరం, పాల్గుణ శుద్ధ

భార్య : సరస్వతీబాయి

ఆశ్రమంలో పేరు : శ్రీరాఘవేంద్ర తీర్థులు

రచన గ్రంథాలు : శ్రీమన్యాయసుధ పరిమళ,

48 గ్రంథాలు

బిరుదులు : వెంకటనాథాచార్య,

పరిమళాచార్య, మహాభాష్య

బృందావన ప్రవేశం : క్రీ.శ.1671 వీరూధినామ

సంవత్సరం, శ్రావణ బహుళ

విదియ, శుక్రవారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement