ఆశ్రిత జనపాల.. అశ్వత్థ బృందలోల | - | Sakshi
Sakshi News home page

ఆశ్రిత జనపాల.. అశ్వత్థ బృందలోల

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

ఉరుకుంద క్షేత్రంలో పోటెత్తిన భక్తజనం

వేకువ జామునే దర్శనాల కోసం క్యూ

మంత్రాలయం: అశ్వత్థ వృక్షంలో లీనమై ఆశ్రిత జనపాలకుడిగా ఉరుకుంద నరసింహా ఈరన్న స్వామి వర్ధిల్లుతున్నారు. ఇష్టదైవాన్ని కొలిచేందుకు భక్తజనం పోటెత్తుతున్నారు. మొదటి సోమవారం రెండు లక్షల మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. ఎంతో పవిత్రంగా స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో క్షేత్రం శోభిల్లింది. దర్శన క్యూలైన్లు, స్నానపు ఘాట్లు, అన్నదాన సత్రం, ప్రసాద, తలనీలాల కౌంటర్లు భక్తులతో కిక్కిరిశాయి. భక్తుల సందడితో క్షేత్ర వీధులు కనువిందు చేశాయి.

విశేషంగా ఈరన్న పూజలు

వేడుకల్లో భాగంగా ఈరన్న స్వామికి వేకువజామున సుప్రభాత సేవతో పూజోత్సవాలు ప్రారంభమయ్యాయి. పండితులు వేదపఠనం గావిస్తూ నిర్మల్య విసర్జన, జల, విశేష పంచామృతాభిషేకంతోపాటు పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కానిచ్చారు. నైవేద్య సమర్పణ, మహా మంగళహారతులు పట్టి పూజోత్సవాలు చేపట్టారు. పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

దర్శనాలకు నిరీక్షణ

ఇలవేల్పును కొలిచేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వేకువజామున 3 గంటల నుంచే భక్తులు దర్శన క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. రెండు గంటల పాటు క్యూలైన్ల గేట్లు తెరవలేదు. దీంతో నిరీక్షణలో ఉన్న భక్తులు అసహనానికి లోనయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రాతఃకాలంలోనే దర్శనాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే అధికారులు ఉదయం 5 గంటలకు తలుపులు తెరవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కాసేపు గేట్ల వద్ద తోపులాట చోటుచేసుకుంది. భక్తులు స్థానిక ఎల్లెల్సీ కాలువలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనాలకు వెళ్లారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు. భక్తులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరిపడా శౌచాలయాలు లేకపోవడంతో క్యూ కట్టాల్సి వచ్చింది. కొందరు తాగునీటి ట్యాంకులతోనే స్నానాలు కానిచ్చారు. మరికొందరు ట్యాంకులపైకి ఎగబాకి స్నానాలు చేసిన దృశ్యాలు కనిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement