బావిలో దూకి మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

బావిలో దూకి మహిళ ఆత్మహత్య

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

వెలుగోడు: పట్టణంలోని సిద్ధబావి వీధికి చెందిన పరుచూరి సరస్వతి (50) అనారోగ్య సమస్యలతో విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త బాలకృష్ణ సుమారు 20 ఏళ్ల క్రితం మృతి చెందగా, సరస్వతికి పిల్లలు లేరని బంధువు కటకం ఎల్లా సుబ్బమ్మ సోమవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్న సరస్వతికి పది రోజులుగా రక్త విరేచనాలు అవుతున్నాయని, అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైందని తెలిపారు. ఈ క్రమంలో వెలుగోడులోని రెడ్డిగారి వీధిలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కటకం ఎల్లసుబ్బమ్మ పోలీసులకు వెల్లడించారు.

రైతు దుర్మరణం

వెల్దుర్తి: మండల పరిధిలోని చెరుకులపాడు గ్రామానికి చెందిన రైతు బోయ రవి (40) సోమవారం ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందాడు. ఎస్‌ఐ నరేశ్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ రవి తన సొంత పొలంలో బెండకాయ సాగు చేశాడు. పొలంలోని రింగు బావి నుంచి మోటారు సాయంతో సాగునీరందించేవాడు. బావిలో నీరు బాగానే ఉన్నా పైప్‌ ద్వారా పైకి రాకపోవడంతో మంగళవారం బావిలోని ఫుడ్‌బాల్‌కు చెత్త అడ్డుపడి ఉంటుందని భావించాడు. చెత్తను తొలగించేందుకు తాడు సాయంతో రింగుబావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. తాడు ఒక్కసారిగా తెగడంతో గోడరాయికి తగిలి బావిలో పడిపోయాడు. అక్కడున్న వారు వెంటనే మరో తాడు సాయంతో బావిలోకి దిగి రవిని పైకి తెచ్చారు. కొన ఊపిరితో ఉన్న రవిని 108 అంబులెన్స్‌లో స్థానిక సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచి, విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికెన్‌ బిర్యానీలో

నిషేధిత రంగులు

కర్నూలు (హాస్పిటల్‌): నిషేధిత సింథటిక్‌ రంగులతో చికెన్‌ బిర్యానీ తయారు చేస్తుండడాన్ని ఆహార భద్రత అధికారులు గుర్తించారు. సోమవారం స్థానిక పాతబస్టాండ్‌ సమీపంలోని హజ్‌మండ్‌ హబ్‌ అనే బిర్యానీ సెంటర్‌ను అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ సతీష్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రాజగోపాల్‌ తనిఖీ చేశారు. అక్కడి ఫ్రిజ్‌లో ముందు రోజు తయారు చేసిన చికెన్‌ ఫ్రై నిల్వ ఉండటాన్ని గమనించి పారబోయించారు. చికెన్‌ పీసులపై నిషేధిత రంగులు వాడి ఆకర్షణీయంగా తయారు చేసి వినియోగదారులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సాగర్‌ అనే ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు దాడులు నిర్వహించారు. బిర్యానీ సెంటర్‌లో ఆహార పదార్థాలతో పాటు వంట గది సైతం అపరిశుభ్రంగా ఉందని, దీన్ని సరిచేసుకోవాలని బిర్యానీ సెంటర్‌ వారికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రంగులు కలిపిన చికెన్‌ పీసులను శ్యాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు.

టెంకాయ కొట్టేందుకు సుంకం!

మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో వసూళ్ల జాతర కొనసాగుతూనే ఉంది. టెంకాయ కొట్టేందుకు భక్తులు ప్రత్యేకంగా టికెట్లు తీసుకుంటున్నా కొట్టుడుకు మాత్రం మేటీలు సుంకం వసూలు చేస్తున్నారు. సోమవారం లక్ష మందికిపైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. స్వామికి జోడు టెంకాయలు సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. టెంకాయ కొట్టేందుకు ఆలయం రూ.5 టికెట్‌ పెట్టింది. అయితే ఇవేమీ మేటీలు పట్టించుకోవడం లేదు. భక్తుల నుంచి ముక్కుపిండి టెంకాయకు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. టెంకాయ కొట్టేందుకు డబ్బులు వసూలు చేయరాదని ఆలయ అధికారులు అక్కడే ఫ్లెక్సీలు పెట్టడం గమనార్హం. మేటీలకు ఇదేమీ పట్టడం లేదు. తమ దోపిడీని షరామామూలే అన్నట్లుగా మార్చుకున్నారు. తమ ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులను దోచుకుంటున్నారు. ఈ వసూళ్లు అధికారుల కళ్లెదుటే సాగిపోతున్నా నోరు మెదపని వైనం. అడగడుగునా వసూళ్లు ఉండటంతో భక్తులు తలలు పట్టుకుంటున్నారు. ఇదేమి దోపిడీ అంటూ విస్తుపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement