● కళ్లకు గంతలు కట్టి.. నల్లరంగు పూసి ● ఆళ్లగడ్డలో హైఅలర్ట్
ఆళ్లగడ్డ: ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వైఎస్సార్ విగ్రహం ముఖానికి గుడ్డ కట్టి, విగ్రహం అంతా నల్లటి రంగు (కందెన) పూసి తమ కుటిల బుద్ధిని బయటపెట్టుకున్న ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి అనంతరం ఈ దుశ్చర్యకు పాల్పడగా సోమవారం తెల్లవారు జామున వాకింగ్‌కు వచ్చిన స్థానికులు కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చారు. అంతలోనే సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమై తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహానేతను అవమానించడం క్షమించరాని నేరమన్నారు. ఇది విగ్రహంపై జరిగిన దాడికాదని.. కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. విగ్రహానికి నల్లరంగు పూసినంత మాత్రన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత ప్రతిష్ట ఏమాత్రం మసకబారదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణంపై సమగ్ర దర్యాపు జరిపించాలని డిమాండ్ చేశారు.
నిందితుడికి రిమాండ్
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ముఖానికి గుడ్డ కట్టి, నల్ల రంగు పూసిన ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఘటనపై వైఎస్సార్ సీపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనకు పాల్పడింది పట్టణ శివారులోని చింతకుంట గ్రామానికి చెందిన రమణారెడ్డిగా గుర్తించామన్నారు. నంద్యాలోని ఓ హోటల్‌లో ఉండగా అదుపులోకి తీసుకుని నల్ల రంగు బాటిల్, ఒక సుత్తి, ఉలి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడు వీటిని అమేజాన్‌లో కొనుగోలు చేసినట్లు వెల్లడైందన్నారు. కేవలం విగ్రహ ధ్వంసమే కాకుండా రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతల కు విఘాతం కలిగించే చర్యగా విచారణలో గుర్తించామన్నారు. విలేకరుల సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగరాజారావు పాల్గొన్నారు.


