మార్చురీలో రాబందులు | - | Sakshi
Sakshi News home page

మార్చురీలో రాబందులు

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

కర్నూలు(హాస్పిటల్‌): అనాథ శవాలను రాబందులు పీక్కుతింటాయి. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు అక్కడి వైద్యులు, సిబ్బంది బాధిత కుటుంబసభ్యులను డబ్బు కోసం పీడిస్తున్నారు. చేతిలో పచ్చనోట్లు పడితేనే పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడిగిన మేర డబ్బులు ఇవ్వకపోతే కేసును ఎక్కడ వ్యతిరేకంగా రాస్తారోనని భయపడి డబ్బులు ఇచ్చి పనిచేయించుకుని వెళ్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజూ 18 నుంచి 20 మంది దాకా వివిధ కారణాలతో మరణిస్తుంటారు. ఇందులో నాలుగు నుంచి ఐదు దాకా మెడికో లీగల్‌ కేసులు ఉంటాయి. ఇలాంటి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది.

మరణించినప్పటి నుంచే వసూళ్లు

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణిస్తే, మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు కింది స్థాయి సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకోవాలి. ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి రూ.200 నుంచి రూ.500 వసూలు చేస్తారు. ఆ తర్వాత పోలీసులు పంచనామా రాస్తారు. దీంట్లో కొందరు పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మృతుడి వివరాలు, జరిగిన ఘటన వంటివన్నీ అందులో పేర్కొంటూ ఒక నివేదిక తయారు చేస్తారు. ఉన్నది ఉన్నట్లు రాస్తే ఒక రేటు, బాధిత కుటుంబీకులకు ఇబ్బంది లేకుండా రాస్తే మరొక రేటు ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసును బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెప్పాల్సి వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం పోస్టుమార్టం సామగ్రి తేవాలని సిబ్బంది రూ.1500 నుంచి రూ.2 వేల దాకా వసూలు చేస్తారు. పోస్టుమార్టం జరుగుతుండగానే డాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుందని రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం జరిగిన పలు పోస్టుమార్టంల విషయంలోనూ ఇదే విధంగా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు వీడియో, ఆడియో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

మార్చురీలో ఎవరైనా మృతుల కుటుంబీకుల నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్ల పేరు చెప్పి కొందరు పోలీసులు వసూలు చేస్తున్నారని తెలిసింది. పోలీసులు వసూలు చేస్తే మేమేమీ చేయలేం. సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.

– డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ,

ప్రిన్సిపాల్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ

డబ్బులివ్వందే పోస్టుమార్టం

జరగదు

మృతుల కుటుంబీకుల నుంచి

బలవంతంగా వసూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement