కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యలు, లోపాలు, దాగిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. సోమవారం వెంకటరమణ కాలనీలోని కీర్తన అనాథ శరణాలయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నిర్వహించిన 70వ ఆవిర్భావ దినోత్సవానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఏపీయూడబ్ల్యూజే జెండాను సీనియర్ పాత్రికేయులు జీ.చంద్రశేఖర్ ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ పరిధిలో ఉన్నవి తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి నగరపాలక సంస్థ తరఫున సాధ్యమైనంత వరకు కృషి చేస్తామన్నారు. అనంతరం అనాథ శరణాలయం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, చిన్నారులకు తినిపించారు. అలాగే పిల్లలకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఇండియా జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, సీనియర్ జర్నలిస్ట్ జి.చంద్రశేఖర్, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి పాల్గొన్నారు.


