కర్నూలు (టౌన్): నిత్యం న్యాయపరమైన విధులతో తీరిక లేకుండా ఉండే ఉద్యోగులకు క్రీడా పోటీలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని జిల్లా మొదటి అదనపు జడ్జి కమలాదేవి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా జ్యుడిషీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెయింట్ జోసఫ్ కళాశాల క్రీడా మైదానంలో 1 వ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. జిల్లా జడ్జి క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తి చాటాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జ్యుడిషీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ కోర్టులకు చెందిన జ్యుడిషియల్ ఉద్యోగులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


