మాట్లాడుతున్న జేసీ నూరుల్ ఖమర్
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక నృత్యం
కర్నూలు(సెంట్రల్): ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అధికార యంత్రాగం తూతూ మంత్రంగా నిర్వహించి మమ అనిపించింది. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి డుమ్మా కొట్టారు. ఇక కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతోపాటు మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులందరూ గైర్హాజరయ్యారు. ఒక్క పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాత్రమే కార్యక్రమానికి వచ్చారు. ఇక కలెక్టర్‌కు బదులుగా హాజరైన జేసీ పాణ్యం ఎమ్మెల్యేతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులు గైర్హాజరు కావడంపై గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదివారం కావడంతో కలెక్టర్ కూడా సమావేశానికి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాదికి ఒక్కసారి జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకే కలెక్టర్, ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యాంటే వారికి గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై ఏ మాత్రం ధ్యాస ఉందో అర్థమవుతుందని కొందరు గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి రాకపోతే తాము చెప్పే సమస్యలు ఎవరూ పట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టపడి చదివితే అభివృద్ధి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ..గిరిజన విద్యార్థులు కష్టపడి చదువుకుంటే గిరిజన తండాలు, చెంచు గూడెలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ, అభివృద్ధి పథకాలను గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి సురేష్ చదివి వినిపించారు. కాగా, సమావేశంలో గిరిజన బాలబాలికలు చేసిన సాంస్కృతిక నృత్యాలు సభాభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన సలహా మండలి సభ్యుడు పి.వెంకటపతి, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కై లాష్ నాయక్, జిల్లా అధ్యక్షుడ యోగేష్ నాయక్, గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకుల రాజు, రామ మహేంద్రనాయక్, సూర్య, కుశాల్, ఆల్ ఇండియా బంజార సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు సేవాలాల్‌నాయక్, కార్యదర్శి సీమకృష్ణ రాథోడ్ నాయక్, సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుండాల్ నాయక్, శంశాక్, మద్దిలేటి, సీమకృష్ణ, డీవీఎంసీ సభ్యులు పాల్గొన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే మినహా
మిగతా నియోజకవర్గాల
ప్రజాప్రతినిధులందరూ డుమ్మా
కలెక్టర్‌కు బదులుగా హాజరైన
జేసీ నూరుల్ ఖమర్


