కోడుమూరు రూరల్: వానల్లేక హంద్రీ నది ఒట్టిపోవడంతో గోరంట్ల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. గ్రామానికి మంచినీటిని అందించే బోర్లు అడుగంటి పోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 40 రోజులుగా ప్రజలు తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇంటికి ఒకరు చొప్పున గ్రామస్తులు పనులు మానుకొని సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి బైక్‌లపై నీళ్లు తెచ్చుకుంటున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీకి విడుదల చేసి నీటి కష్టాలను తీర్చాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజలు వేడుకుంటున్నా ఎవరూ చలించడం లేదు. కంటి తుడుపు చర్యగా ఒక్క రోజు రెండు ట్యాంకర్లు నీటిని సరఫరా చేసి చేతులెత్తేశారు. గ్రామంలో యథేచ్ఛగా బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అధికార టీడీపీ నేతలు ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీనదిలోకి వదిలి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే మంచినీళ్ల కోసం రోడ్డెక్కాల్సి ఉంటుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.


