జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ మూడు గేట్ల నుంచి తాగునీటి అవసరాలకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైల జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం భారీగా తగ్గిందన్నారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో జూరాల నుంచి ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలోకి కేవలం 44,279 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 878.60 అడుగుల నీటితో 181.0590 టీఎంసీల నీటిమట్టం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 877.60 అడుగుల నీటిమట్టం ఉండగా 4,5,6 గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 4 వేల క్యూసెక్కులు, జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ప్రస్తుతం డ్యాంలోకి వరదనీటి ప్రవాహం తగ్గిపోయినందున తాగునీటి అవసరాల నిమిత్తం రిజర్వాయర్లను నింపుతున్నట్లు తెలిపారు.


