● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ
కర్నూలు (టౌన్): మహిళలకు రక్షణ కవచంలా ఉన్న దిశ చట్టం రద్దు నిర్ణయాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఆదివారం స్థానిక దేవనగర్‌లోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి అమలు చేసిన దిశ యాప్ మహిళలకు అన్నలా, తమ్ముడిలా రక్షణగా నిలిచిందన్నారు. అనాడు జగనన్న ఈ యాప్ తీసుకు రావడంతో పాటు సత్వర న్యాయానికి 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారన్నారు. ఆ సమయంలో 1.51 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రమాద సమయంలో మహిళల చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కదిలిస్తే 15 నిముషాల్లో పోలీసులు వచ్చి బాధితులను రక్షించే వారన్నారు. జగనన్నపై ఉన్న రాజకీయ ఈర్ష్యతో దిశ చట్టాన్ని నిర్వీర్యం చేయడం దురదృష్ట కరమన్నారు. దిశ చట్టాన్ని రద్దు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం రౌడీమూకలు, ఉన్నాదుల ఆగడాలకు లైసెన్సు ఇవ్వడం కాదా.. అని ప్రశ్నించారు. మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని, మహిళల ప్రాణాలతో చెలగాటమాడే ఈ అనాలోచిత నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు.


