● వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు సిట్రా సత్యనారాయణమ్మ, సిద్ధారెడ్డి రేణుక
ఆలూరు: పోలీసులు న్యాయాన్ని కాపాడాలని, టీడీపీకి తొత్తులుగా మారొద్దని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక సూచించారు. మండల కేంద్రమైన చిప్పగిరిలో ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ, కుటుంబసభ్యులను శనివారం పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తయనుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములతోపాటు మరి కొందరిపై వివిధ రకాలు కేసులను నమోదు చేసి జైలుకు పంపడం దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, అరాచక పాలన సాగుతోందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకెళ్లారన్నారు. ఎప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే ఉండబోదని, వచ్చే రోజుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందని, ఽధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబ సభ్యులకు తెలిపారు. టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులను వదలబోమని హెచ్చరించారు.


