కొలిమిగుండ్ల(అవుకు): గుండ్లశింగవరం శివార్లలో ఓ వ్యక్తి శనివారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కొలిమిగుండ్ల మండలం నాయినపల్లెకు చెందిన గొల్ల చిన్న గంగన్న(45) గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని మరి కొంత మంది గొర్రెల మందలతో కలిసి గుండ్లశింగవరం సమీపంలో ఉంచి మేపుకుంటుండేవారు. మంద దగ్గరి నుంచి కుమారుడు ఇంటికి రావడంతో గంగన్న శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్లాడు. గొర్రెల మందకు దూరంగా పొలాల్లో ఉన్న చెట్టుకు లుంగీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న అవుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
ఆస్పరి: కారు ఢీకొని ఆస్పరిలో శనివారం రాత్రి కోసిగి ఈరన్న (55) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తులు, ఆస్పరి సీఐ శ్రీనివాసులనాయక్ తెలిపిన వివరాలు మేరకు.. ఆస్పరికి చెందిన కోసిగి ఈరన్న రోడ్డు పక్కన వెళ్తుండగా పత్తికొండ నుంచి ఆస్పరి వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈరన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి దగ్గర నుంచి వెళ్లిన వ్యక్తి కారు ఢీకొని మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటనా స్థలానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


