కర్నూలు (టౌన్): సీసీ కెమెరాలు నిఘాను మరింత పటిష్టం చేస్తాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బి.తాండ్రపాడు సమీపంలోని కాదంబరి టౌన్‌షిప్‌లో శుక్రవారం 35 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, వ్యా పార సంస్థల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చన్నారు. పోలీసులు, ప్రజల సమన్వయంతో నే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ కేశవ రెడ్డి,తాలూకా సీఐ తేజమూర్తి,కాదంబరి టౌన్‌షి ప్‌కాలనీఅసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో అవమాన భారంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బుడగజంగాల శేఖర్ గౌండ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన తూర్పాటి వెంకటేశ్వర్లు శేఖర్ వద్ద దాదాపు రూ. 2 లక్షల వరకు అప్పు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రెండు రోజుల క్రితం అప్పు డబ్బులు తిరిగి చెల్లించాలని వెంకటేశ్వర్లును శేఖర్ ఒత్తిడి చేశారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడం వలన శేఖర్‌పై వెంకటేశ్వర్లు దాడికి పాల్పడ్డాడు. అప్పు తీసుకుని దాదాపు మూడేళ్లు అవుతున్నా తిరిగి చెల్లించకపోగా అడిగినందుకు తనపైనే దాడి చేయడాన్ని జీర్ణించుకోలేని శేఖర్ గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని కుటుంబీకులు కర్నూలుకు తరలించారు.


