హడావుడిగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

హడావుడిగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

● తాగునీటి అవసరాలకు మాత్రమేనన్న ఎస్‌ఈ ● సాగునీటిపై ప్రశ్నిస్తారని మొహం చాటేసిన ప్రజాప్రతినిధులు

● తాగునీటి అవసరాలకు మాత్రమేనన్న ఎస్‌ఈ ● సాగునీటిపై ప్రశ్నిస్తారని మొహం చాటేసిన ప్రజాప్రతినిధులు

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు జలవనరులశాఖ ఎస్‌ఈ శివశంకర్‌రెడ్డి, ఈఈ సుబ్రమణ్యంరెడ్డి, డీఈ నగేష్‌ హడావుడిగా నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం ఉదయం 8 గంటలకు అనుమతిచ్చినట్లు పేర్కొన్న ఎస్‌ఈ అరగంటలోనే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడాన్ని చూస్తే ఏదో మతలబు ఉందనే విషయం అవగతం అవుతుంది. గేట్లకు పూజలు చేసి 5, 6 గేట్లను స్విచ్‌ ఆన్‌ చేసి 2 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు పూజలు చేసి వాయనం సమర్పించి రెగ్యులేటర్‌ వద్ద ఒక్క అధికారి కూడా ఉండకుండా వెళ్లిపోవటం గమనార్హం. సాయంత్రం 6గంటల సమయానికి నీటి విడుదలను 4వేల క్యూసెక్కులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.

ఈ విషయమై ఎస్‌ఈ శివశంకర్‌రెడ్డిని ఫోన్‌లో సమాచారం అడగ్గా.. ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 10 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం విడుదల చేసుకునేందుకు అనుమతివ్వడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నీటితో వెలుగోడు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను నింపుతామన్నారు. ఆయకట్టు కింద పంటలు ఎండుతున్నాయని, సాగునీటి సంగతేంటని ప్రశ్నించగా శ్రీశైల జలాశయంలో వరద పెరిగి ప్రభుత్వం అనుమతిస్తే విడుదల చేస్తామని చెప్పారు.

మొహం చాటేసిన ప్రజాప్రతినిధులు

ఏటా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు పోటీపడే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మొహం చాటేయడం గమనార్హం. పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌, కేసీ ఎస్కేప్‌ కాల్వల ఆయకట్టు కింద పంటలు ఎండుతున్నాయి. సాగునీటి కోసం రైతులు ప్రశ్నిస్తారని గ్రహించిన ప్రజాప్రతినిధులు గేట్లు ఎత్తేందుకు మొహం చాటేయ్యడంతో రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement