బొమ్మలసత్రం: నంద్యాల రూరల్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షోరాణ్, సబ్‌డివిజన్ ఏఎస్పీ సుస్మిత పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నంద్యాల మండలం రైతునగరం గ్రామ సమీపంలోని శివసాయి గార్డెన్స్‌లో కోదండరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. గతేడాది మార్చి 7న రాత్రి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు దంపతులు బయటకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న 11.5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం ఉదయం పోలీసులు రైతునగరం బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక రాష్ట్రం దండేలి గ్రామానికి చెందిన జాఫర్ అని, దొంగతనానికి పాల్పడింది తానేనని అంగీకరించాడు. చోరీకి పాల్పడిన వారిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వివరించారు. నిందితుడి వద్ద ఉన్న 11.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన తాలుకా సీఐ ఈశ్వరయ్య, సీసీఎస్ సీఐ సురేష్‌కుమార్ తదితర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఆభరణాలు స్వాధీనం


