టీబీ డ్యామ్‌కు కొనసాగుతున్న వరద | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

Aug 6 2026 2:20 AM | Updated on Aug 6 2026 2:20 AM

● పోలకల్‌లో విషాదం

హొళగుంద: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని హొస్పేట్‌ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువన ఉన్న తుంగా ప్రాజెక్ట్‌ నుంచి 35 వేల క్యూసెక్కులను వదులుతుండగా ఆ నీరు టీబీ డ్యాం వైపు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు 1,00,750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. తాగునీటి అవసరాలకు కాలువలకు 1,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం ఎగువ భాగంలోని ఆగుంబే, శృంగేరి, తీర్థనహళ్లీ, వరనాడు, శివమొగ్గ, చిక్‌ మంగళూర్‌ తదితర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 1,633 అడుగుల డ్యాం మట్టానికి గాను బుధవారానికి 1,624 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 68 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

నీటి డ్రమ్ములో పడి

బాలుడి మృతి

సి.బెళగల్‌: ఆడుకుంటున్న బాలుడు నీటి డ్రమ్ములో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపింది. సి.బెళగల్‌ మండలంలోని పోలకల్‌ గ్రామ బీసీ కాలనీలో నివాసం ఉంటున్న బోయ గంపరాజు గోవిందు, సుజాత దంపతులకు ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు వివేక్‌ ఉన్నాడు. బుధవారం అదే గ్రామంలోని బంధువులు వారిని భోజనానికి ఆహ్వానించడంతో కుమారుడితో వెళ్లారు. అయితే అక్కడ బాలుడు వివేక్‌ను ఇంటి ఆవరణలోని కట్ట (అరుగు)పై ఆటాడుకునేందుకు వదిలారు. కుటుంబ సభ్యుల చిన్న ఏమరపాటులో కొన్ని నిమిషాల్లోనే వివేక్‌ కనిపించకపోవడంతో వారు ఇంటి పరసరాల్లో వెతికారు. కాగా బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో కట్ట దగ్గరున్న నీటి డ్రమ్ములో కుటుంబ సభ్యులు చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

యాగంటీశ్వరుడికి

సహస్ర ఘటాభిషేకం

బనగానపల్లె రూరల్‌: యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు బుధవారం వరుణ జపసహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, పాలక మండలి చైర్మన్‌ బండి మౌళీశ్వరరెడ్డి, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం 108 జల కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర్లు మూలవిరాట్‌లు మునిగేంత వరకు 1008 బిందెలలో జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషే కం, సహస్ర ఘటాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పాండురంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని వరుణ జపసహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement