టీబీ డ్యాంకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Aug 5 2026 1:53 AM | Updated on Aug 5 2026 1:53 AM

ఎగువన భారీ వర్షాలు

డ్యాంలో ఒకే రోజు 7 టీఎంసీల

నీరు చేరిక

హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌ వద్ద నిర్మించిన ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి మంగళవారం భారీ ఎత్తున వరద పోటెత్తింది. సోమవారం ఉదయం డ్యాంలో 44.190 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్‌ఫ్లో 90 వేల క్యూసెక్కుల వరకు రావడంతో మంగళవారం ఉదయం నాటికి 51.145 టీఎంసీల నీరు నిల్వ అయ్యాయి. ఒక్క రోజులోనే 7 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. సాయంత్రం నాటికి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరడంతో బుధవారం ఉదయం నాటికి 60 టీఎంసీల (పూర్తి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు) నీరు నిల్వ కానున్నాయి. నీటిమట్టం1633 అడుగులకు గాను 1620 అడుగులకు చేరింది. డ్యాం ఎగువన నిర్మించిన గాజనూరు జలాశయం(అప్పర్‌ తుంగా) పైభాగంలోని శివమొగ్గ, తీర్థనహళ్లి, శృంగేరి, వరనాడు, మలెనాడు, కొప్ప ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్ర రిజర్వయర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు ఇదే విధంగా ఉంటే వారం పది రోజులో డ్యాం నిండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జలాశయంలో చేరిన నీటితో ఖరీఫ్‌ సాగుకు, ఏడాది పాటు తాగునీటికి డోకా ఉండదు. అయినా భారీ ఎత్తున వరద వస్తుండడంతో ఈ ఏడాది రెండు కార్ల పంట తీసుకునే అవకాశం దొరుకుతుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.

ఎల్లెల్సీలో తగ్గిన నీటిమట్టం

తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో నీటిమట్టం తగ్గింది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ఇరురాష్ట్రాల కోటకు సంబంధించి ఎల్లెల్సీ హెడ్‌లో దాదాపు 1,200 క్యూసెక్కుల నీటిని వదిలేవారు. అందులో కర్ణాటక కోటా నీటిని కొద్ది రోజుల నుంచి తగ్గిస్తూ వస్తుండడంతో కాలువలో నీటిమట్టం తగ్గిందని, ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నట్లు బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. ఆంధ్రాకు సంబంధించి ఈ నెల 10వ తేదీ వరకు వదిలి ఆ తర్వాత పరిస్థిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇక ఎల్లెల్సీ ఆంధ్ర కాలువ ప్రారంభం 250 కి.మీ వద్ద 540 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement