● నిద్రిస్తున్న కుమారుడిని గొడ్డలితో
నరికి చంపిన తండ్రి
● మద్యం తాగొద్దనడంతో దారుణం
బనగానపల్లె రూరల్: మద్యం తాగి జులాయిగా తిరగొద్దని చెప్పినందుకు విచక్షణ కోల్పోయి తండ్రి కన్న కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన బనగానపల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని యనకండ్ల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలంలోని యనకండ్ల గ్రామానికి చెందిన గొల్ల బాలమద్దిలేటి, సుబ్బమ్మ దంపతుల కుమారుడు మధుకృష్ణ (30) జీవాల పెంపకంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తండ్రి బాలమద్దిలేటి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్య సుబ్బమ్మ, కుమారుడు మధుకృష్ణ, కోడలు అర్చనతో ఘర్షణ పడేవాడు. ఐదు రోజుల క్రితం భార్య సుబ్బమ్మతో ఘర్షణ పడుతుండగా బాలమద్దిలేటిని మద్యం తాగొద్దని కుమారుడు మందలించాడు. దీంతో ఇంట్లోవారికి చెప్పకుండా కోవెలకుంట్ల మండలంలోని లింగాల గ్రామానికి వెళ్లి పని చేసుకుంటూ అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న మధుకృష్ణ ఆదివారం తండ్రి వద్దకు వెళ్లి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. బాలమద్దిలేటి రాత్రి భోజనం చేసేందుకు మజ్జిగ కావాలని అడగడంతో మధుకృష్ణ డబ్బులు ఇచ్చాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు భోజనం చేసి నిద్రించారు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన బాలమద్దిలేటి నిద్రిస్తున్న కుమారుడు మధుకృష్ణను గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. అడ్డుకోబోయిన కోడలు, భార్య సుబ్బమ్మపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మధుకృష్ణ అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ కల్పన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా భార్య గర్భిణిగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


