కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఎముకలు బలహీనపడటం, కీళ్ల నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు మోకాళ్ల సమస్యలు 60 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. ప్రస్తుతం 30 ఏళ్లకే అవి పలకరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని మురికివాడల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అధికంగా కీళ్లనొప్పులతో బాధపడే వారే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వారికి నొప్పి నివారణ మందులు, కాల్షియం మాత్రలు, విటమిన్–సి, బి.కాంప్లెక్స్ మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. పట్టణాల్లోని వైద్యులు మాత్రం ఎముకలకు సంబంధించిన మల్టీవిటమిన్ మాత్రలు, విటమిన్–డి, కాల్షియం మాత్రలు, నొప్పి నివారణ మాత్రలు ఇస్తున్నారు. కీళ్ల అరుగుదల ఎక్కువైన వారికి దశలను బట్టి పలు రకాల ఇంజెక్షన్ చికిత్సలు, వాటికీ తగ్గకపోతే చివరకు మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. నొప్పులు తగ్గేందుకు దీర్ఘకాలంగా పెయిన్ కిల్లర్లు వాడే వారిలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో కొందరు డయాలసిస్ దశకు వెళ్తూ చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ప్రతి నెలా 1600 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు.
పెరుగుతున్న కీళ్లు,
ఎముకల బాధితులు
శారీరక శ్రమ లేకపోవడంతో
ఈ రుగ్మత
వైద్యుల వద్దకు క్యూ కడుతున్న
బాధితులు
నేడు జాతీయ ఎముకలు,
కీళ్ల దినోత్సవం


