కోడుమూరు రూరల్: మండలంలోని గోరంట్ల గ్రామానికి మంచినీటిని అందించే హంద్రీ నది వానల్లేక ఒట్టిపోయింది. హంద్రీలో నీరు లేక, గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బోర్లు పనిచేయక గ్రామంలోని కొళాయిలకు గత నెల రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. వాడుకోవడానికి వదిలేసి కనీసం తాగేందుకు కూడా నీళ్లు దొరక్క గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. చివరకు గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై బిందెలతో నీటిని తెచ్చుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గోరంట్ల హంద్రి నదికి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని విడుదల చేసి తమ ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


