● నేడు సహస్ర ఘటాభిషేకం
మహానంది: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని కాంక్షిస్తూ మహానంది క్షేత్రంలో గురువారం వరుణయాగం పూజలు నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, అర్చకులు, రుత్వికుల బృందం పూజలు చేశారు. ముందుగా గణపతిపూజతో ప్రారంభించి త్రయాహ్నిక వరుణయాగం పూజలు జరిపారు. ఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి వర్షాలు కురవాలని కాంక్షిస్తూ పూజలు జరిపామన్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు వరుణయాగం, సహస్ర ఘటాభిషేకం పూజలను వేదమంత్రాలతో వరుణదేవుని ఆరాధన చేసి వర్షాలు కరువాలని, భూమికి జలసంపద, పాడిపంటలకు రక్షణ, ప్రజలకు శ్రేయస్సు కలగాలని శాస్త్రోక్తంగా పూజలు చేస్తామని వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని వివరించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠ్వేర రాజు, పి. సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


