ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఇందిరేశ్వరం బీట్‌లో బుధవారం కనిపించిన పులి కళేబరానికి గురువారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. డీకంపోజ్ దశలో ఉన్న కళేబరానికి చనిపోయిన చోటే శవపరీక్షలు నిర్వహించి దహనం చేశారు. పులి శరీరంపై గాయాలుండడంతో టెరిటోరియల్ ఫైట్ (వాసం కోసం పోరాటం)లో డామినేటెడ్ మేల్ టైగర్ చేత గాయపడి మరణించి ఉండవచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. పులి 9 సంవత్సరాల వయసు కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆత్మకూరు డీడీ విగ్నేష్ అపావ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ఎన్‌టీసీఏ గైడ్ లైన్స్ పరిధిలో పూర్తి చేశామన్నారు.
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
ఆదోని సెంట్రల్: ప్రేమించిన అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి రైలు కింద పడి శివరాజ్(20) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామ య్య తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన పాండవగల్లు ఎల్లప్ప అనారోగ్యంతో ఏడాది క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి అతని కుమారుడు శివరాజ్ తాగుడుకు అలవాటు పడ్డాడు. తన అక్క కూతురిని ప్రేమించానని, పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. మద్యానికి బానిసైన శివరాజ్‌కు అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టం లేక వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో మనస్తాపం చెందిన శివరాజ్ బుధవారం రాత్రి ఇస్వి–కుప్పగల్ ఆర్‌ఎస్‌ల మధ్యన రైలు కింద పడి మృతిచెందాడు. గూడ్స్ రైలు లోకో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని తల్లి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొని యువకుడి మృతి
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణ సమీపంలో అవుకు రోడ్డులో జీఎంఆర్ వేర్ హౌస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొండ పేటకు చెందిన చాకలి బాలసుబ్బన్న, జయ మ్మ దంపతుల కుమారుడు సుధాకర్ (28) గురువారం ఇంటి నుంచి గేదెలను మేపుకునేందుకు అవుకు రోడ్డు వైపు ఉన్న పొలాల వైపు బయల్దేరాడు. జీఎంఆర్ వేర్‌హౌస్ వద్ద వెయింగ్ వేబ్రిడ్జి వద్ద ఉన్న లారీని డ్రైవర్ రివర్స్ చేస్తుండగా అక్కడే ఉన్న సుధాకర్‌ను ఢీకొంది. లారీ టైరు అతనిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బనగానపల్లె పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. చేతికి వచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బనగానపల్లె టౌన్ ఇన్‌చార్జ్ సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
డోన్ టౌన్: స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ రసూల్ (59) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్‌ఐ బింధు మాధవి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన రసూల్ డోన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కాగా అనారోగ్యం కారణంతో ఈ నెల 27వ తేదీ నుంచి సెలవులో ఉన్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే డిప్యూటీ స్టేషన్ మాస్టర్ లాబాన్ విషయం తెలుసుకుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి భార్య రేష్మాకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్యతో పాటు తో ఒక కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ బింధు మాధవి తెలిపారు.
కల్వర్టు గుంత చుట్టూ
మట్టి కుప్ప!
కల్లూరు: కర్నూలు నగరంలోని కృష్ణానగర్ రవీంద్ర స్కూల్ లైన్‌లో డ్రైనేజీ కాలువపై ఏర్పాటు చేసిన కల్వర్టు దెబ్బతిని గుంత ఏర్పడింది. గుంత చుట్టూ రక్షణగా మట్టి కుప్పను వేసి కానుగ ఆకులను ఉంచారు. ఈ రోడ్డుపై ద్విచక్ర, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. రాత్రి సమయంలో కల్వర్టుకు రక్షణగా ఏర్పాటు చేసిన మట్టి కుప్ప సరిగా కనిపించకపోతే వాహనాలు డ్రైనేజీ కాలువపై ఉన్న కల్వర్టు గుంతలో పడితే గాయాలకు గురికావాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


