ఆలూరు: రేషన్ షాపులకు పంపిణీ చేసే నిత్యావసర సరుకులు వివరాలు నోటీస్ బోర్డులో ఉండాలి. అయితే ఆలూరు పట్టణంలోని ఎల్లార్తి రోడ్డు సమీపంలో ఉన్న సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌లో ఇవి కనిపించడం లేదు. వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని గతంలో గోదాం డిప్యూటీ తహసీల్దార్‌ను పత్తికొండ ఆర్డీఓ చిన్న ఓబులేసు ఆదేశించారు. నెలరోజులు గడిచినా ఎలాంటి మార్పు రాలేదు.
కరువు జిల్లాగా ప్రకటించాలి
కర్నూలు(సెంట్రల్): ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు పడకపోవడంతో రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోయాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు నాలుగు బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతున్నా సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి, వేరుశనగ, కంది, జొన్న, సజ్జ తదితర పంటలన్నీ నష్టపోయినట్లు చెప్పారు.


