శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం పలువురు దాతలు ఆరు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేశారు. ప్రస్తుతం వాటిలో ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. మిగతా వాహనాలు మరమ్మతులకు గురై వర్క్‌షాప్‌కు చేరాయి. దీంతో క్షేత్రానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. దాతలు విరాళంగా అందించిన బ్యాటరీ వాహనాలను నడపకుండా దేవస్థానం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుడటంపై పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల కరుణా కటాక్షాల కోసం అనునిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. పర్వదినాల్లో, ముఖ్యమైన రోజుల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. అయితే క్షేత్ర భద్రతా చర్యల్లో భాగంగా భక్తులు బస చేసిన వసతి గదుల నుంచి తమ వాహనాల్లో కొంత దూరం వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఈ క్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను క్యూలైన్ల వద్దకు చేర్చేందుకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం ఉచిత బ్యాటరీ వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గత దేవస్థాన పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కనకదుర్గ–1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–1, యూనియన్ బ్యాంక్–2, తాడేపల్లికి చెందిన దాత–1, మరో దాత–1 ఇలా ఆరు బ్యాటరీ వాహనాలు దేవస్థానానికి సమకూరాయి. నంది సర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్, శీఘ్ర, అతిశీఘ్ర క్యూలైన్, ఆర్జిత సేవల క్యూలైన్, అన్నదాన భవనం, లడ్డూ కౌంటర్, దర్శనం అనంతరం నంది సర్కిల్ వరకు ఆరు బ్యాటరీ వాహనాలతో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవ కొనసాగుతుంది. వాహన డ్రైవర్లు భక్తులకు ఉచిత ప్రయాణ సేవ గురించి అవగాహన కల్పిస్తూ వారు వెళ్లాల్సిన ప్రాంతాలకు వాహనంలో చేర్చేవారు.
మూలనపడిన బ్యాటరీ వాహనాలు
శ్రీశైల దేవస్థానంలో ఆరు బ్యాటరీ వాహనాలు ఉండగా ప్రస్తుతం ఒక్క వాహనం మాత్రమే నడుస్తోంది. మిగతా ఐదు వాహనాలు వర్క్‌షాప్‌లో మూలనపడ్డాయి. దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతో బ్యాటరీ వాహనాలు మరమ్మతులకు గురై వర్క్‌షాప్‌కు చేరినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎంతగానో ఉపయోగపడే బ్యాటరీ వాహనాలు దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం వల్లనే పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా దేవస్థాన అధికారులు స్పందించి వెంటనే బ్యాటరీ వాహనాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తేవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
శ్రీశైల దేవస్థానానికి ఉచితంగా
బ్యాటరీ వాహనాలు అందించిన దాతలు
అధికారుల నిర్లక్ష్యంతో పనిచేయని
బ్యాటరీ వాహనాలు
ఇబ్బందులు పడుతున్న వృద్ధులు,
దివ్యాంగ భక్తులు


