నంద్యాల(న్యూటౌన్): వివిధ రంగాల్లో పని చేస్తున్న షెడ్యూల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆయా రంగాల్లో ఉత్పత్తిని స్తంభింపజేస్తామని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ పట్టణంలోని కోవెలకుంట్ల –నూనెపల్లి జంక్షన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కార్మిక వర్గం లేకుండా ప్రభుత్వాలు నడవలేవన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. బజారు హమాలీలు, వేర్‌హౌస్‌లు, షాపింగ్ మాల్‌లు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీలు, గనుల్లో పనిచేసే కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదన్నారు. జీతాలు పెంచమంటే జీవోలు ఉన్నాయా అని అడుగుతున్నారని, కానీ ఎమ్మెల్యేలకు మాత్రం లక్షల వేతనాలు పెంచడం న్యాయమేనా అని ప్రశ్నించారు. కనీస వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్‌ఓ రామునాయక్‌కు అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, బాల వెంకట్, వెంకట్ లింగం, రామ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు కే మహమ్మద్ గౌస్, శివరాం జిల్లా నాయకులు రణధీర్, రత్నమయ్య, మారెన్న, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బాలదుర్గ,భాస్కరాచారి రంగనాథ్, గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, వీఆర్‌ఏ సంఘం జిల్లా నాయకుడు శివరామకృష్ణ పాల్గొన్నారు.


