బైకును ఢీకొన్న ఐచర్‌.. ఇద్దరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బైకును ఢీకొన్న ఐచర్‌.. ఇద్దరి దుర్మరణం

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

తాడిపత్రి రూరల్‌: బైకును ఐచర్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తాడిపత్రి అప్‌గ్రేడ్‌ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాల జిల్లా కొలమిగుండ్ల మండలం బందార్లపల్లికి చెందిన అన్నదమ్ములు పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి (35), సమీప బంధువు రాజేంద్ర (40)లు బండల గనిలో కూలీలుగా పనిచేసేవారు. కొన్ని రోజులుగా పెద్ద దస్తగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గనిలో పని చేసి ఇంటికి వచ్చిన అతనికి అకస్మాత్తుగా బీపీ పడిపోయింది. దీంతో చిన్న దస్తగిరి, రాజేంద్రలు కలిసి పెద్ద దస్తగిరిని బైకులో ఎక్కించుకుని వైద్యం కోసం తాడిపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో మండలంలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద గల పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు దెబ్బతినడంతో బైకును చిన్నగా పోనిస్తుండగా ఓ ఐచర్‌ వాహనం వేగంగా వచ్చి వీరిని ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన రాజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చిన్న దస్తగిరి, పెద్ద దస్తగిరిని 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్న దస్తగిరి మృతి చెందాడు. రాజేంద్రకు భార్య అలివేలితో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్న దస్తగిరికి భార్య కవితతో పాటు 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐచర్‌ డ్రైవర్‌ రఘురాముడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement